సిరాజ్..నిఖత్ జరీన్ కు గ్రూప్ -1 జాబ్స్
తీర్మానం చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రానికి తమ ప్రతిభా పాటవాలతో క్రీడా రంగాలలో పేరు తీసుకు వచ్చేలా చేసిన ప్రముఖ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ , మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ లకు గ్రూప్ -1 పోస్టులతో పాటు 600 గజాల స్థలాలను ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇదే సమయంలో ఇతర క్రీడాకారులకు కూడా సహకారం అందించాలని ఎమ్మెల్యేలు కోరారు.
ఈ సందర్బంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సిరాజ్, జరీన్ , షూటర్ ఇషా సింగ్ లకు గ్రూప్ -1 పోస్టులతో పాటు ఇల్లు కట్టుకునేందుకు స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్రీడా పాలసీని తీసుకు వస్తామని తెలిపారు.
దేశంలో హర్యానా రాష్ట్రంలో అద్భుతమైన స్పోర్ట్స్ పాలసీ ఉందని, దానిని కూడా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు సీఎం. ఇండియా ప్రపంచ కప్ గెలవడంలో సిరాజ్ పాత్ర ఉందన్నారు. ఇక నిఖత్ జరీన్ సైతం ఎన్నో పతకాలు తీసుకుని వచ్చిందన్నారు.
రాబోయే రోజుల్లో దేశానికి మన రాష్ట్రం తరపు నుంచి వివిధ క్రీడా రంగాలలో ప్రాతినిధ్యం ఉండేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం. ఇందుకోసమే కొత్తగా క్రీడా పాలసీని తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.