అప్పలాయగుంటలో ఘనంగా ఉత్సవాలు
తిరుపతి – తిరుపతి లోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వామి వారు మోహినీ అలంకారంలో దర్శనం ఇచ్చారు.
మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మ వార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.
రాత్రి 7.30 గంటల నుండి విశేషమైన గరుడ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, కంకణ భట్టర్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు.