ఏపీకి రుతు పవనాల రాక
అప్రమత్తంగా ఉండాలని సూచన
అమరావతి – రాష్ట్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీకి నైరుతి రుతు పవనాల జాడ రానుందని తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య , వాయువ్య బంగాళా ఖాతంలోని మరి కొన్ని ప్రాంతాలలోకి మరింత విస్తరించాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
దీనితో పాటుగా పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మీదుగా నైరుతి బంగాళా ఖాతంకి ఆనుకుని దక్షిణకోస్తా -ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందన్నారు. వీటి ప్రభావంతో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
4న మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఎల్లుండి విజయనగరం, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.