నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎంపీ
హైదరాబాద్ – భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యవహారంపై ఎద్దేవా చేశారు. లీక్ అయిన కవిత లేఖ చూస్తుంటే బీఆర్ఎస్ వీక్ అయినట్లు కనపడుతోందన్నారు.కేటీఆర్ కు పట్టాభిషేకం అని ప్రచారం జరగడంతో కవిత, హరీష్ రావు లలో ఆందోళన మొదలైందన్నారు. కల్వకుంట్ల కవిత లేఖలో అనేక ముఖ్య అంశాలకు సంబంధించి కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అంత పెద్ద సభలో వేరే ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కవిత స్పష్టం చేసిందని, దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏమంటారంటూ ప్రశ్నించారు. జనం చెవుల్లో పూలు పెట్టాలని చూస్తే చివరకు కవిత లేఖ బీఆర్ఎస్ లో లుకలుకలను బయట పెట్టిందన్నారు.
ప్రజా సమస్యలు, బీసీ కులగణన, బీజేపీని ఎండగట్టంపై మాట్లాడితే బాగుండు డాడీ అని కవిత ఆవేదన వ్యక్తం చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని స్వయంగా చెప్పడం తమను విస్తు పోయేలా చేసిందన్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్న వారికి ప్రాధాన్యత లేదని కూడా తేటతెల్లం చేసిందన్నారు. కవిత లేఖపై బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు .