ఆయనకు అంత సీన్ లేదని ఫైర్
హైదరాబాద్ – భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి కేటీఆర్ కు అంత సీన్ లేదన్నారు. తమ పార్టీ, ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సీఎంపై ఇంకోసారి నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత 10 ఏళ్ల పాలనా కాలంలో ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ పేరు చెప్పి నిట్ట నిలువునా దోచుకున్నారంటూ ఆరోపించారు.
అందినంత మేర దండుకున్నారని, కల్వకుంట్ల కుటుంబంపై విచారణ జరిపించి తీరుతామని అన్నారు. కోట్లాది రూపాయలు వెనకేసుకుని, లెక్కలేనన్ని ఆస్తులను పోగేసుకుని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
వ్యవస్థలను నిర్వీర్యం చేసింది చాలక పైగా తమపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఒక స్థాయి కలిగిన కేటీఆర్ పదవి పోయిందని, అధికారం కోల్పోయామనే ఫ్రస్టేషన్ తో తలతిక్కగా మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు .