ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – గద్దర్ నక్సలైట్ అని, ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తి లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ గురించి ఏం అర్హత ఉందని మాట్లాడారంటూ ప్రశ్నించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నేపథ్యం లేని బండికి నోరు పారేసు కోవడం తప్పా ఏమీ తెలియదన్నారు. ప్రజల పట్ల, తెలంగాణ ప్రాంతంపై అభిమానం లేని తనను ప్రజలు క్షమించరని అన్నారు.
సోమవారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రం నుంచి ఇద్దరని కేంద్ర మంత్రులను చేస్తే ఉపయోగం ఏముందంటూ ప్రశ్నించారు. గద్దర్ గురించి ఇంకోసారి మాట్లాడితే ఊరుకోమన్నారు.
సోయి ఉండే మాట్లాడుతున్నారా బీజేపీ నేతలంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ ఎక్కడ మీరెక్కడ అంటూ నిలదీశారు. ఒక సామాజిక ప్రయోజనం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రజా యుద్దనౌక గద్దర్ అంటూ పేర్కొన్నారు. ఇంకోసారి చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు ఉరికించడం ఖాయమన్నారు.