కేంద్రం నిర్వాకం తెలంగాణకు శాపం
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి లోక్ సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం పార్లమెంట్ లో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ తయారు చేశారని ఇది పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు.
భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా బీజేపీ సర్కార్ ప్రయత్నం చేస్తోందని, ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024 తెలియ చేస్తుందని అన్నారు. భారత దేశం అంటే ఆ రెండు రాష్ట్రాలేనా అని నిలదీశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇలా వ్యవహరించడం దారుణమన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే నాలుగున్నర కోట్ల ప్రజలను అవమానించడం తప్ప మరోటి కాదన్నారు ఎంపీ. కేవలం తమ ప్రభుత్వాన్ని కాపాడు కోవడానికి మాత్రమే బడ్జెట్ ను ప్రవేశ పెట్టినట్లు అనిపిస్తోందని ధ్వజమెత్తారు.
అసలు కేంద్రంలో ప్రభుత్వం అనేది ఎందుకు వుందోనన్న అనుమానం తమకు కలుగుతోందన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి అసంపూర్తి, అసంబద్ద, వివక్షా పూరితమైన బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన దాఖలాలు లేవన్నారు. కానీ ఆ పేరును మోడీ సర్కార్ నిలబెట్టుకుందంటూ ఎద్దేవా చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.