మోదీ ఫోటో పెడితే బియ్యం మీదే బాధ్యత
బీజేపీ ఎంపీ డీకే అరుణపై నిప్పులు చెరిగారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డులపై విధిగా పీఎం మోదీ పెట్టాలనడం పట్ల ఫైర్ అయ్యారు. ఫోటో పెడితే 90 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ప్రస్తుతం అంచనాకు మించి రేషన్ కార్డులు ఉన్నాయని, ప్రస్తుతం తాము 54 లక్షల కార్డులకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామన్నారు. కేంద్రం కేవలం ఒక కేజీ బియ్యం మాత్రమే అదనంగా ఇస్తోందని ధ్వజమెత్తారు ఎంపీ. ప్రతి నెలా ఇందు కోసం తాము రూ. 352 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
బుధవారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అవగాహన రాహిత్యంతో డీకే అరుణ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు.
ప్రజలను తప్పు దోవ పట్టించడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందన్నారు. కానీ జనం వారిని నమ్మే స్థితిలో లేరన్నారు. ఇప్పటికే జీఎస్టీ పరంగా తెలంగాణ నుంచి ఎక్కువగా కేంద్రానికి చెల్లించడం జరుగుతోందని చెప్పారు. కానీ ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ చెల్లిస్తూ తమకు నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తే మంచిదన్నారు.