అనకాపల్లిలో మిట్టల్..నిప్పన్ స్టీల్ కంపెనీ
త్వరలో ఏపీ సర్కార్ అధికారిక ప్రకటన
అమరావతి – త్వరలోనే ఏపీ రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ తీపి కబురు చెప్పనుంది. ఈ విషయాన్ని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని అనకాపల్లి శివారులో భారీగా పెట్టుబడులు రానున్నాయని ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెల్లడించనుందని తెలిపారు.
గురువారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీపావళి పండుగ సందర్బంగా ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లి ప్రాంతం పారిశ్రామికంగా కేరాఫ్ కానుందని పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ ఏపీ అభివృద్దికి తోడ్పాటు ఇవ్వనుందని స్పష్టం చేశారు సీఎం రమేష్.
యార్సెలర్ మిట్టల్ గ్రూప్ , నిప్పన్ స్టీల్ కంపెనీ నక్కపల్లె సమీపంలోని మెగా స్టీల్ ప్లాంట్ లో రూ. 70,000 కోట్లు (ఫేజ్ -1 ) కింద పెట్టుబడిగా పెట్టనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిని రెండు దశల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ స్టీల్ కంపెనీ కారణంగా దాదాపు కంపెనీ ద్వారా ఇక్కడి ప్రాంతానికి చెందిన వారితో పాటు ఇతరులకు దాదాపు 20,000 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని తెలిపారు.