పేరుకే ఎంపీని చంద్రబాబుదే పెత్తనం
గల్లా జయదేవ్ షాకింగ్ కామెంట్స్
గుంటూరు జిల్లా – తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై నర్మ గర్భంగా వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తాను అలసి పోయానని, ఇక రాజకీయాల నుంచి కొంత కాలం దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
విచిత్రం ఏమిటంటే తాను ఎంపీగా ఉన్నప్పటికీ తనకంటూ ఎలాంటి అధికారం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ ఉండదన్నారు గల్లా జయదేవ్. చంద్రబాబు ఏది చెబితే అది మాత్రమే చేయాలి. ఒక రకంగా తల ఆడించాల్సిందే తప్ప ఏమీ చేసేందుకు ఉండదన్నారు.
తన దృష్టిలో రాజకీయాలు కేవలం పార్ట్ టైమ్ మాత్రమేనని పేర్కొన్నారు. పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం లేదన్నారు. తమ వ్యాపారాలు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని, దీనిని అత్యంత బాధతో ప్రకటిస్తున్నట్లు చెప్పారు.