ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం
అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ – రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో క్రీడలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రధానంగా గత ప్రభుత్వం కేవలం మాటల వరకే పరిమితం అయ్యిందని, తాము వచ్చాక నూతన క్రీడా పాలసీని తీసుకు వస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు చివరకు ఏకగ్రీవంగా ముగియడం విశేషం.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినాని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పి. వెంకట ప్రశాంత్ , కార్యదర్శిగా సానా సతీష్ , సంయుక్త కార్యదర్శిగా విష్ణు కుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్ , కౌన్సిలర్ గా డి. గౌరు విష్ణు తేజ్ ఎన్నికయ్యారు.
ఇదిలా ఉండగా ఏసీసీ చీఫ్ గా ఎన్నికైన ఎంపీ కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు. తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ అభివృద్దికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఐపీఎల్ కు కూడా ప్రాతినిధ్యం వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు కేశినేని చిన్ని.