పార్టీ మారను జగన్ ను వీడను
ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి
అమరావతి – తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి. ఇదంతా పుకారు తప్ప వాస్తవం కాదన్నారు. తాను రాజకీయాలలో ఉన్నంత వరకు తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు రాజకీయ పరంగా మద్దతు ఇచ్చిన మాజీ సీఎంను ఎలా విడిచి వెళతానని ప్రశ్నించారు.
ఇదంతా కావాలని కొందరు చేస్తున్న దుష్ప్రచారంగా కొట్టి పారేశారు. దీనిని ఎవరూ నమ్మవద్దని కోరారు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి. కొందరితో పాటు కొన్ని మీడియా సంస్థలు తనను కావాలని టార్గెట్ చేశాయని ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు ఎంపీ.
రాజకీయాలలో తాను ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని మరోసారి పేర్కొన్నారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని, ఆయన ఏది చెబితే తాను అది చేస్తానని, ప్రస్తుతానికి పార్టీ బలోపేతంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు చెప్పారు.
విలువలు లేని వాళ్లు, పదవుల కోసం ఆశ పడే వారు మాత్రమే పార్టీని వీడుతారని, తాను అలా కాదని స్పష్టం చేశారు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి. తాను పార్టీని వీడనున్నట్లు జరిగే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన వైసీపీ నేతలు, కార్యకర్తలను కోరారు.