పిటిషన్ల కమిటీ చైర్మన్ గా ఆప్ ఎంపీ
నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీ – ఆప్ , భారతీయ జనతా పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నువ్వా నేనా అంటూ ప్రస్తుతం రాబోయే శాసన సభ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఈ తరుణంలో కీలక ప్రకటన చేసింది కేంద్ర సర్కార్. ఈ మేరకు ఆప్ కు తీపి కబురు చెప్పింది.
ఆమ్ ఆద్మీ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా, వివాద రహితుడిగా పేరు పొందిన ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తాకు కీలక పదవిని కట్టబెట్టింది. ఈమేరకు కేంద్ర సర్కార్ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం గుప్తాను అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పార్లమెంట్ పిటిషన్ల కమిటీకి చైర్మన్ గా నియమించింది.
ఇందుకు సంబంధించి కేంద్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఇవాళ ఎక్స్ వేదికగా పంచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. కాగా ఎంపీ ఎన్ డీ గుప్తా ఇప్పటికే పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పబ్లిక్ అండర్ టేకింగ్, సంస్కృతి, పర్యాటక మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో కూడా సభ్యుడిగా నియమితులయ్యారు.
ఆయన ఇప్పటికే పని చేస్తున్నారు. విశిష్ట సేవలు అందజేస్తున్నారు. ఎన్డీ గుప్తా పిటిషన్ల కమిటీకి చైర్మన్ గా నియమించడం పట్ల అభినందించారు ఆప్ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అతిషి, ఎంపీలు రాఘవ్ చద్దా, సంజయ్ ఆజాద్ సింగ్ .