ఏపీ కూటమి సర్కార్ బేకార్ – రౌత్
కొనసాగేందుకు అర్హత లేదు
న్యూఢిల్లీ – శివసేన పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో బుధవారం వైసీపీ బాస్ జగన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, పూర్తిగా అప్రజాస్వామికంగా తయారైందని ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగేందుకు అర్హత లేదన్నారు సంజయ్ రౌత్. ఇవాళ జగన్ చేస్తున్నది న్యాయమైన పోరాటమని పేర్కొన్నారు.
గతంలో జగన్ రెడ్డి సీఎంగా ఉన్నారని, ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారని రేపొద్దున తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. రాజకీయాలలో ఇది సర్వ సాధారణమని, కానీ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా కాక ముందే ఇలా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను, కార్యకర్తలను చంపడం దారుణమన్నారు.
జగన్ రెడ్డి ఆరోపణలు చేసినట్లు అక్కడ స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. తాను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ఎంపీలు మద్దతు పలకడంతో ఇండియా కూటమిలో జగన్ రెడ్డి చేరుతారా అన్న అనుమానం కలుగుతోంది.