అదానీ..సెబీ చైర్మన్ వ్యవహారంపై తేల్చండి
నిప్పులు చెరిగిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆయన తాజాగా హిండెన్ బర్గ్ బయట పెట్టిన నివేదిక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆదివారం సంజయ్ ఆజాద్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలో కొలువు తీరిన మోడీ భారతీయ జనతా పార్టీ సర్కార్ ఎలా అదానీకి మద్దతు పలుకుతుందో దీని ద్వారా అర్థమై పోయిందన్నారు. ప్రధానంగా అదానీ, సెబీ మధ్య ఉన్న రహస్య ఒప్పందం విషయం గురించి పూసగుచ్చినట్లు హిండెన్ బర్గ్ తాజా నివేదికలో బట్ట బయలు చేసిందన్నారు సంజయ్ ఆజాద్ సింగ్.
గతంలో హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ తప్పంటూ అదానీ కంపెనీ కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టాలని అదానీ, సెబీలను ఆదేశించిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు విచారణ చేపట్టిన దాఖలాలు లేవన్నారు.
వెంటనే అదానీ, సెబీ చైర్మన్ ల మధ్య ఉన్న ఒప్పందం గురించి బయట పెట్టాలని ఎంపీ డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ మాధవి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ 10 మిలియన్ డాలర్లు అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారని అన్నారు.