ఎగ్జిట్ పోల్స్ బక్వాస్
సంజయ్ సింగ్ ఫైర్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 17వ విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గంప గుత్తగా ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. అన్నీ కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ గ్రాండ్ విక్టరీ నమోదు చేస్తుందని పేర్కొన్నాయి. ముచ్చటగా మూడోసారి పీఎంగా మోడీ కొలువు తీరడం ఖాయం అంటూ స్పష్టం చేశాయి. ఈ సందర్బంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో స్పందించారు ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్.
ఆ ఎగ్జిట్ పోల్స్ కేవలం బీజేపీ జేబు సంస్థలుగా పేర్కొన్నారు. వాటి ముందస్తు ఫలితాలు ఓ డ్రామా అంటూ కొట్టి పారేశారు ఎంపీ. గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలను మోసం చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ఆయన ఏం ఉద్దరించారని తిరిగి బీజేపీకి పట్టం కడతారంటూ ప్రశ్నించారు .
విచిత్రం ఏమిటంటే ఆయా సంస్థలలో ఎగ్జిట్ పోల్స్ తయారు కాలేదని ఆరోపించారు సంజయ్ ఆజాద్ సింగ్. అవన్నీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో తయారైనట్లు సంచలన కామెంట్స్ చేశారు ఎంపీ. ఈ ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బక్వాస్ అంటూ కొట్టి పారేశారు. ప్రజలు వీటిని చూసి నవ్వుకుంటున్నారని సెటైర్ వేశారు ఎంపీ.