భూ కబ్జా అబద్దం – సంతోష్ రావు
పక్కా ఆధారాలు నా వద్ద ఉన్నాయి
హైదరాబాద్ – భూ కబ్జాకు పాల్పడినట్లు బంజారా హిల్స్ స్టేషన్ లో ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై కేసు నమోదు కావడం సంచలనం రేపింది. దీంతో ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు . తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కావాలని తనను వ్యక్తిగతంగా బద్నాం చేసేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆవేదన చెందారు. ఈ సందర్బంగా తాను ఎవరి నుంచి ఎలా కొనుగోలు చేశాననే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలన్నా తాను శ్యాంసుందర్ ఫుల్జాల్ అనే వ్యక్తి నుంచి 2016లో (సేల్ డీడ్ నంబర్ 5917/2016. 11 నవంబర్ 2016) పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశానని తెలిపారు.
రూ. 3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి, బాజాప్తాగా సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. కాబట్టి ఫోర్జరీ అనే మాటకు తావు లేదన్నారు. అది వాస్తవం కాదని పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయ వివాదం తలెత్త లేదని చెప్పారు. తనను ఈ విషయంపై ఎవరూ సంప్రదించ లేదని తెలిపారు .
నేను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట లేదన్నారు ఎంపీ. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయని తెలిపారు. ఒకవేళ ఏమైనా న్యాయ పరమైన అంశాలు ఉంటే ముందుగా నాకు లీగల్ నోటీసు ఇవ్వాలన్నారు. వివరణ అడగాలని పేర్కొన్నారు. కానీ అలాంటి వేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. వివాదాస్పద ఇంటి స్థలం 1350 గజాలు అని పోలీసులు, మీడియా పేర్కొంటున్నారు. కానీ నేను కొన్నది 904 గజాల ఇంటి స్థలం మాత్రమేనని గమనించాలని పేర్కొన్నారు.
దీనిని బట్టి ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు అని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. నేను ఎలాంటి కబ్జాలకు పాల్పడ లేదన్నారు. తాను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.