బీజేపీపై భగ్గుమన్న ఎంపీ సోయం
నాకు టికెట్ రాకుండా అడ్డు పడ్డారు
ఆదిలాబాద్ జిల్లా – భారతీయ జనతా పార్టీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా కొందరు అగ్ర నేతలు అడ్డు పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ బిడ్డనైన తాను రెండోసారి గెలిస్తే ఎక్కడ కేంద్ర మంత్రి అవుతానోనని భయంతో తనకు టికెట్ రాకుండా చేశారంటూ ఆరోపణలు చేశారు.
తాను కొమ్మపై ఆధారపడిన వ్యక్తిని కానని, స్వతహాగా పైకి వచ్చిన వాడినని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ పేర్కొన్నారు సోయం బాపురావు. రెండో జాబితాలో తనకు టికెట్ వస్తుందని అనుకుంటున్నానని, ఒకవేళ తనకు రాకుండా చేస్తే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు ఎంపీ.
తనకంటూ చాలా దారులు ఉన్నాయని, ఢిల్లీలో కూర్చుని రాజకీయాలు చేస్తే ఇక్కడ ఎవరూ మౌనంగా చూస్తూ ఊరుకోరని పరోక్షంగా హెచ్చరించారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు. ప్రస్తుతం ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.