బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒక్కటే
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత
హైదరాబాద్ – పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీఆర్ఎస్ ను ఏకి పారేశారు. బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒక్కటేనని , రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్టేనని ఆరోపణలు చేశారు. తాను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. గులాబీ పార్టీలో ఉండలేక పోయానని పేర్కొన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న అనంతరం వెంకటేశ్ నేత మీడియాతో మాట్లాడారు. గ్రూప్ వన్ అధికారిగా ఇంకా 18 ఏళ్ల పాటు సర్వీసు ఉండగానే తాను రాజీనామా చేసి వచ్చానని చెప్పారు. తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడి పోయానని తెలిపారు. ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలిచానని అన్నారు.
బీఆర్ఎస్ లో రాచరికం తప్ప ప్రజాస్వామ్యం అన్నది లేదన్నారు. ఐదేళ్ల పాటు తెలంగాణ కోసం పార్లమెంట్ లో గళం ఎత్తానని , కానీ మిగతా ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ధ్వజమెత్తారు వెంకటేశ్ నేత.