మార్చి 3న మేదరమెట్లలో సిద్ధం సభ
ఏర్పాట్లపై ఎంపీ విజయ సాయి సమీక్ష
నెల్లూరు జిల్లా – ఏపీలో వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతుతోంది జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ . పార్టీ సీనియర్ నాయకుడు , ఎంపీ విజయ సాయి రెడ్డి పార్టీ పరంగా చేపట్టే సిద్దం సభపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇన్చార్జిలతో సమీక్ష చేపట్టారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో జగన్ రెడ్డి సారథ్యంలో మూడు సిద్దం సభలు పూర్తయ్యాయి. పల్నాడు జిల్లా మేదరమెట్లలో నిర్వహించ బోయేది నాలుగవ సభ. దీనిని వచ్చే నెల మార్చి 3న నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది వైసీపీ .
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైస్సార్సీపీ కార్యాలయంలో రీజనల్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వీ. విజయ సాయిరెడ్డి, రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రీజనల్ కో-ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు.
మేదరమెట్లలో జరగనున్న నాల్గవ సిద్ధం సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన కార్యక్రమాల పైన చర్చించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
భీమిలి, ఏలూరు, రాప్తాడులలో జరిగిన మూడు సిద్ధం సభలకు భిన్నంగా మేదరమెట్ల సిద్ధం సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చే వారంలో నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
అదేవిధంగా జిల్లా పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని రెండు మూడు రోజుల్లో నియామకం చేయడం జరుగుతుందని చెప్పారు. రాజ్యసభకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలో ఎవరు కూడా దూషించలేదని, ఆయన పైన ఎటువంటి ఆరోపణ కూడా చేయలేదని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.