NEWSANDHRA PRADESH

రాధాకృష్ణా బ‌హిరంగ చ‌ర్చ‌కు రెడీ

Share it with your family & friends

స‌వాల్ విసిరిన విజ‌య సాయి రెడ్డి

అమ‌రావ‌తి – వైఎస్సార్సీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్ గ్రూప్ సంస్థ‌ల చీఫ్ , ఎండీ రాధాకృష్ణ‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో తాను బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. ఎక్క‌డైనా ఎప్పుడైనా స‌రే తాను వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు బుధ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

బహిరంగ చర్చ కు నేను రెడీ అని, నీవు విసిరిన ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నాన‌ని తెలిపారు. ఫేస్ టు ఫేస్.. కౌంటర్ కు ఎన్ కౌంటర్.. నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతి కి నేను రావాలా అని ప్ర‌శ్నించారు విజ‌య సాయి రెడ్డి.

ఢిల్లీ లో ఎన్జీఓలు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని టీవీ చానెల్స్ ని అందరిని ఆహ్వానించి ప్రజావేదిక మీద విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందాం అని అన్నారు ఎంపీ. తాను ప్ర‌స్తుతం ఐక్యరాజ్యసమితి లో జ‌రిగే స‌మావేశంలో పాల్గొనాల్సి ఉంద‌ని, తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా చ‌ర్చించేందుకు సిద్ద‌మ‌ని పేర్కొన్నారు విజ‌య సాయి రెడ్డి.

ఎవరి చిత్తశుద్ధి ఏంటో తేల్చుకుందాం. తగ్గేదేలే! భయపడేదే లేద‌న్నారు. గత 5 ఏళ్లలో మద్యం, ఖనిజ సిండికేట్ బ్రోకర్లు, మిగతా ఇతరత్రా డీల్స్ లో మీ బాస్ పేరు చెప్పి వసూళ్లు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కూలంకషంగా చర్చిద్దాం అన్నారు.

జర్నలిస్ట్ కాలనీ లో నువ్వుండే ప్యాలస్, నేనుండే బాడుగిళ్ళు కూడా చూపిద్దాం అన్నారు ఎంపీ. ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డు లో నువ్వు కొన్న నూరు కోట్ల విలువ చేసే స్థలం దాంట్లో ఇంకో రెండు వందల కోట్ల తో కట్టుతున్న ఆఫీస్ భవంతి కూడా పరిశీలిద్దామ‌ని ప్ర‌క‌టించారు.