ప్రకటించిన విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీతో పాటు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తు వ్యవసాయమేనని స్పష్టం చేశారు. పొలం పనులు చేసుకుంటూ కాలం గడుపుతానని అన్నారు. రాజకీయాల నుంచి తప్పు కోవడం వెనుక ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. ఇంకొకరు చెబితే తాను నిర్ణయం తీసుకునే చిన్న పిల్లాడిని కానన్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, తాను పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు విజయ సాయి రెడ్డి.
రాజ్యసభ సభ్యత్వానికి ఇవాళ రాజీనామా లేఖను సమర్పించానని చెప్పారు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదంటూ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతమని చెప్పారు.
నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని అన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు.
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ , రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పని చేశానంటూ పేర్కొన్నారు.
దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.