పార్టీని వీడను జగన్ మాట జవదాటను
వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కామెంట్
అమరావతి – వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. బుధవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను పార్టీ వీడుతున్నట్లు ఓ వర్గం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఊపిరి ఉన్నంత వరకు తాను వైసీపీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, అధికారం కోల్పోయినంత మాత్రాన పార్టీ నుంచి వెళ్లి పోతానంటూ దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఎంపీ విజయ సాయి రెడ్డి. తాను నిబద్ధత కలిగిన నాయకుడినని పేర్కొన్నారు. తాను ముందు నుంచీ దివంగత వైఎస్సార్ కు , ప్రస్తుత మాజీ సీఎం , పార్టీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నానని తెలిపారు.
కొందరు కావాలని తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా కామెంట్స్ చేస్తున్నారని, పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం తనను మరింత బాధకు గురి చేసేలా చేసిందని వాపోయారు విజయ సాయిరెడ్డి. ఇలాంటి కామెంట్స్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎంపీ.
తాను వైసీపీకి, బాస్ జగన్ రెడ్డి వెంటే ఉంటానని, వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తానని తెలిపారు.