కులానికి కొమ్ము కాస్తున్న ఛానళ్లు
నిప్పులు చెరిగిన విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మీడియా గంప గుత్తగా ఏపీలో కొలువు తీరిన టీడీపీ కూటమికి వంత పాడుతున్నాయని ఆరోపించారు. బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు విజయ సాయి రెడ్డి.
ప్రజల తరపున పని చేయాల్సిన ఛానళ్లు, పత్రికలు కేవలం ఒకే కులానికి, సీఎం చంద్రబాబు నాయుడుకు వంత పాడుతుండడం దారుణమన్నారు. పత్రికా, మీడియా రూల్స్ కు విరుద్దంగా బాహాటంగా మద్దతు పలకడం విస్తు పోయేలా చేసిందన్నారు.
ఆధారాలు లేకుండా కేవలం తమ పార్టీకి చెందిన నాయకులను టార్గెట్ గా చేసుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. చంద్రబాబుని సంతృప్తి పరచి మెప్పు పొంది, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్, ఈ టీవీ, ఆర్ టీవీ, వంటి కుల మీడియా యజమానులు తీవ్రంగా పోటీ పడుతున్నారని ఆరోపించారు.
నీతి బాహ్యమైన రీతిలో దుష్ట పన్నాగాలతో బరి తెగించి వైస్సార్సీపీ నాయకులపై విషం చిమ్ముతూ అబద్దపు వార్తలతో దాడికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు విజయ సాయి రెడ్డి. వాస్తవాలను పట్టించుకు కోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ జర్నలిజం నిబద్ధతను గాలి కొదిలి కట్టుకథలను ప్రసారం చేస్తున్నారంటూ ఆరోపించారు ఎంపీ.