బాబు సిట్ ఏర్పాటు బక్వాస్ – ఎంపీ
విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్
అమరావతి – వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్యాప్తునకు సంబంధించి సిట్ ను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. దమ్ముంటే కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపట్టాలని విజయ సాయి రెడ్డి డిమాండ్ చేశారు.
సిట్ ఏర్పాటు చేయడం అంటే సమస్యను పక్కదారి పట్టించడం తప్ప మరోటి కాదని ఎంపీ పేర్కొన్నారు. పవిత్ర పుణ్య స్థలం తిరుమల క్షేత్రంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
చంద్రబాబు నాయుడు అత్యంత బాధ్యతా రాహిత్యంతో ప్రకటన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఏదైనా టీటీడీకి సంబంధించి ఆరోపణలు వచ్చినట్లయితే ముందుగా సీఎం స్థాయిలో టీటీడీ ఈవోతో మాట్లాడి విచారణకు ఆదేశించాలని అన్నారు.
అలాంటిది ఏమీ లేకుండా ఓ వైపు సీఎం ప్రకటన చేయడం, దానికి వంత పాడుతూ పవన్ కళ్యాణ్ దీక్షలకు దిగడం విడ్డూరంగా ఉందని, ఒక రకంగా చూస్తే కేవలం జగన్ రెడ్డిని బద్నాం చేసేందుకు చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు విజయ సాయి రెడ్డి.