12 పరుగుల తేడాతో ముంబై విజయం
ఢిల్లీ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను 12 పరుగుల తేడాతో ఓడించింది. ఏడేళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్ లోకి వచ్చిన కరుణ్ నాయర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కానీ ఇతర ఆటగాళ్లు ఎవరూ ఆశించిన మేర రాణించ లేక పోయారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో పాటు ఫీల్డర్లు అద్భుతంగా రనౌట్లు చేయడంతో పరాజయం పాలైంది ఢిల్లీ తన స్వంత గడ్డమీద. వరుస విజయాలకు బ్రేక్ వేసింది ముంబై ఇండియన్స్.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 రన్స్ చేసింది. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ దుమ్ము రేపాడు. 33 బంతుల్లో 59 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. సూర్య కుమార్ యాదవ్ 40 రన్స్ చేశాడు. ఇక ఢిల్లీ జట్టులో కరుణ్ నాయర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. తను 40 బాల్స్ ఎందుర్కొని 89 రన్స్ చేశాడు. ఇందులో 12 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ గా రంగంలోకి దిగిన నాయర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌల్ట్ బౌలింగ్ లో 3 ఫోర్లు కొట్టాడు. బుమ్రా బౌలింగ్ లో 4, 4,, 6, 4, 6 లతో చెలరేగాడు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.