ఆదిలక్ష్మి అలంకారంలో అలమేలుమంగ
ముత్యపు పందిరిపై అలివేలుమంగ
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మ వారు భక్తులకు అభయమిచ్చారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మ వారిని సేవించుకున్నారు.
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలు మంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలు ముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు.
అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలు మంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని విశ్వాసం.
మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, గంధంతో అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మ వారు భక్తులను కటాక్షించనున్నారు.
వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో జె శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, చలపతి పాల్గొన్నారు.