మల్లా రెడ్డిపై మైనంపల్లి కన్నెర్ర
అక్రమాలు బయట పెడతా
హైదరాబాద్ – మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డిపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు . అధికారాన్ని అడ్డం పెట్టుకుని మల్లారెడ్డి సాగించిన అక్రమాలు, దౌర్జన్యాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. శుక్రవారం మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు.
కమిషనర్, ఎమ్మార్వోలు మల్లారెడ్డికి వత్తాసు పలుకుతున్నారని, నాలుగు బుల్ డోజర్లు పంపించ లేదన్నారు. గత ప్రభుత్వంలో ఊహించని రీతిలో లెక్కకు మించి భూ కబ్జాలు, ఆక్రమణలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా మల్లారెడ్డిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు మైనంపల్లి హనుమంతరావు.
విద్యార్థులతో దొంగ ఓట్లు వేయించిన ఘనత నీది కాదా అని ప్రశ్నించారు. తాను నోరు విప్పితే ఆత్మహత్య చేసుకోక తప్పదన్నారు. కేసీఆర్ వద్ద నీ ఆటలు సాగినవని, కానీ రేవంత్ రెడ్డి వద్ద సాగవని హెచ్చరించారు. కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి వందల కోట్లు ఇచ్చి మంత్రిపదవి తెచ్చు కున్నావని ఎద్దేవా చేశారు. ఇంకోసారి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మల్లారెడ్డిని విడిచి పెట్టనని వార్నింగ్ ఇచ్చారు.