వైసీపీ సర్కార్ కు నాదెండ్ల సవాల్
దమ్ముంటే చర్చకు రావాలని పిలుపు
అమరావతి – జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ సర్కార్ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నవ రత్నాలు పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారులను ఎవరిని అడిగి నియమించారని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాట వేశారని మండిపడ్డారు.
ఆయన ప్రధానంగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డిని ఏకి పారేశారు. ఆయన ఒక్కడి కోసం జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగ స్పూర్తిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచిత్రం ఏమిటంటే కేబినెట్ మంత్రుల వేతనాల కంటే అధికంగా ఉందని ఇది పూర్తిగా చట్ట విరుద్దమన్నారు.
ప్రభుత్వ సలహాదారుల వల్ల ఏపీ రాష్ట్రానికి ఒనగూరింది ఏమిటో చెప్పాలని నిలదీశారు నాదెండ్ల మనోహర్. నెల వారీ వేతనాలకు తోడు అలవెన్సులు, నిర్వహణ ఖర్చులు భారంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిని ఎందుకు ప్రజలు భరించాలని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల నిధులు సలహాదారుల కోసం మళ్లించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన జీవోలను ఎందుకు వెల్లడించడం లేదన్నారు.