బియ్యం మాఫియా వెనుక ఐపీఎస్ ల పాత్ర
విచారణ జరిపి తీరుతామన్న ఏపీ మంత్రి
అమరావతి – ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం తరలింపులో నలుగురు ఐపీఎస్ ల పాత్ర ఉందని ఆరోపణలు చేశారు.
ఒక్క కాకినాడ నగరంలోనే ఏకంగా 43 వేల 249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఇందులో కీలకమైన పాత్ర పోషించిన వారు ఎవరనే దానిపై వివరాలు రావాల్సి ఉందన్నారు నాదెండ్ల మనోహర్.
రాష్ట్రంలో పేదల కడుపు నింపుతున్న రేషన్ బియ్యం వారికే చెందాల్సిన అవసరం ఉందన్నారు. పేదల కడుపు కొట్టేందుకు ఎవరు ప్రయత్నం చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాఫీయా వెనుక ఎవరు ఉన్నా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు ఏపీ మంత్రి.
ధరల స్థిరీకరణకు రీటైలర్స్ తో సమీక్షించామని, రైతులకు ఇవ్వాల్సిన రూ. 600 కోట్లు త్వరలో చెల్లిస్తామని ప్రకటించారు.