రేషన్ మాఫియాకు కాకినాడ కేరాఫ్
మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్స్
అమరావతి – రేషన్ మాఫియాకు కాకినాడ కేరాఫ్ గా మారి పోయిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలోని జిల్లాలే కాదు.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచీ పేదల బియ్యం అక్రమ నిల్వలు ఇక్కడికి చేరాయని స్పష్టం చేశారు.
కాకినాడ పోర్టుల ద్వారా గత ఐదేళ్లలో వేల టన్నుల పీడీఎస్ నిల్వలు పశ్చిమ ఆఫ్రికాలోని వివిధ దేశాలకు ఓడల్లో వెళ్లాయని ఆరోపించారు నాదెండ్ల మనోహర్. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అక్రమ రవాణా బియ్యానికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. 137 మిల్లుల పాత్ర ఉన్నట్లు గుర్తించామని చెప్పారు నాదెండ్ల మనోహర్. గత వైసీపీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ చేసిన నిర్వాకమే దీనికి ప్రధాన కారణమని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని చెప్పారు మంత్రి.