అబద్దాలు చెప్పడంలో జగన్ నెంబర్ వన్
ఎద్దేవా చేసిన నటుడు కొణిదెల నాగబాబు
మంగళగిరి – ప్రముఖ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి దోచుకోవడం, దాచు కోవడం తప్పించి ఆయన ఐదేళ్ల కాలంలో ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. శవ రాజకీయాలకు తెర లేపారని, ప్రస్తుతం కూటమి సర్కార్ పై నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు.
మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలకు క్రియా శీలక సభ్యత్వ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా అనుకోకుండా కాలం చేసిన వారి కుటుంబాలకు పార్టీ పరంగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కార్యకర్తల బాగోగుల గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసించారు.
ఏనాడూ అధికారం కోసం పాకు లాడలేదని కేవలం ప్రజల కోసం, రాష్ట్రం బాగు కోసం శ్రమించాడని అన్నారు. తన సోదరుడిని అనే హక్కు ఎవరికీ , ఏ నాయకుడికీ లేదన్నారు నాగబాబు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే జగన్ రెడ్డి స్పందించాడా , సాయం చేశాడా అని నిలదీశారు. జగన్ ఏనాడైనా తన జేబులోంచి పది రూపాయలు ఇచ్చాడా అని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో మాజీ సీఎం నెంబర్ వన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.