హైకోర్టును ఆశ్రయించిన అక్కినేని నాగార్జున
కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా ఎలా కూలుస్తారు
హైదరాబాద్ – నటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్ లోని ఎన్ – కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా కూల్చి వేయడంపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులో కేసు నడుస్తుండగా ఎలా కూలుస్తారంటూ హైకోర్టులో దావా దాఖలు చేశారు. స్టే ఆర్డర్ విధించినా ధ్వంసం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు అక్కినేని నాగార్జున.
తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేదంటూ స్పష్టం చేశారు. పూర్తిగా అది ప్రైవేట్ భూమి అని, పర్మిషన్ ఇవ్వడంతో కట్టడం చేశామని తెలిపారు. అయితే హైడ్రా మాత్రం కీలక ప్రకటన చేసింది. పూర్తిగా 3 ఎకరాలకు పైగా ఆక్రమించాడని, ఇది తమ్మిడి కుంట చెరువుకు సంబంధించినదని వెల్లడించింది.
2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉండగా మరో 1. 12 ఎకరాలు చెరువు శిఖం కింద (ఫుల్ ట్యాంక్ లెవల్ – ఎఫ్టీఎల్) కు వస్తుందని తెలిపింది. అయితే చెరువును ఎవరూ ఆక్రమించకుండా 2 ఎకరాలను బఫర్ జోన్ గా పెడతారు. దానిని కూడా నాగార్జున ఆక్రమించాడని ఆరోపించింది. అందుకే కూల్చామంటూ స్పష్టం చేసింది.