కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసు
మంత్రిపై సినీ రంగ ప్రముఖుల ఆగ్రహం
హైదరాబాద్ – తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ వద్దకు ఒక్క రాత్రి సమంత రుత్ ప్రభు వెళ్లాలని అక్కినేని నాగార్జున , అమల ఫ్యామిలీ ఒత్తిడి చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆమె చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
దీనిని తీవ్రంగా ఖండించారు అక్కినేని నాగార్జున, అమలతో పాటు తనయుడు నాగ చైతన్య. ఇది తమ వ్యక్తిగత వ్యవహారమని, దీనిపై మాట్లాడే హక్కు మంత్రికి లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి సమంత కూడా స్పందించింది.
ఈ మేరకు దీనిని ఖండిస్తూ అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసు పంపించారు. అంతే కాకుండా పరువు నష్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. క్షమాపణలు చెప్పినా తాము ఊరుకునే ప్రసక్తి లేదంటూ ప్రకటించారు అక్కినేని నాగార్జున. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా వ్యక్తిగత ఆరోపణలు చేస్తారంటూ ప్రశ్నించారు.
మరో వైపు కొండా సురేఖ జీవితంపై కొండా పేరుతో సినిమా తీసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం సీరియస్ అయ్యారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఆమెను కంట్రోల్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.