మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
అమరావతి – మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. మోసం చేయడం జగన్ నైజం అన్నారు. వైపీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. మాట తప్పడం మడమ తిప్పడం జగన్ పేటెంట్ అంటూ ఎద్దేవా చేశారు. ఇది జగమెరిగిన సత్యం. గతంలో నా మైనారిటీలు, నా ముస్లింలు అని పదే పదే చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని అందలం ఎక్కారంటూ ఆరోపించారు. నేడు మళ్లీ వారి ఓట్ల కోసం జగన్ రెడ్డి రకరకాల నాటకాలు ఆడుతున్నాడంటూ మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ముస్లింలకు జగన్ ద్రోహం చేశాడన్నారు. ఈ విషయం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైందన్నారు.
మోడీ అరెస్టు చేయిస్తాడేమో అని ఒకపక్క భయం. ముస్లిం మైనార్టీలో ఓట్లు ఎక్కడ పోతాయే అని ఇంకో రకమైన భయం. పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లుకి వైసీపీ వ్యతిరేకం అని చెప్పాడు. లోక్ సభలో వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్ జారీ చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇప్పటివరకు ఓటింగ్ అయిన తర్వాత విప్ జారీ చేసిన సంఘటనలు గాని జారీ చేసిన పార్టీలు గాని లేవన్నారు. ముస్లింల విషయంలో జగన్ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ఇంతటి మోసానికి జగన్ తెగబడ్డాడు. జగన్ చేసిన మోసం దేశమంతా చూస్తోందన్నారు. నేషనల్ మీడియా కోడై కూస్తోందన్నారు.