అరెస్ట్ ల పర్వం నామా ఆగ్రహం
కేంద్రం కక్ష సాధింపులపై ఫైర్
న్యూఢిల్లీ – కేంద్రం ఎన్నికల వేళ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎంపీలు. శుక్రవారం ఢిల్లీ వేదికగా నామా నాగేశ్వర్ రావు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రెడ్డి, రుద్రరాజు రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కావాలని కేజ్రీవాల్ ను ఇరికించే ప్రయత్నం చేశారంటూ వాపోయారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను బూచీగా చూపించి దాడులకు తెగ బడుతున్నారని , ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అప్రజాస్వామిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. శివసేన పార్టీపై కూడా గతంలో బీజేపీ ఇలాగే కుట్రలు చేసిందని గుర్తు చేశారు.
ఆయా ప్రభుత్వాలు తమకు అనుగుణంగా పాలసీలలో మార్పులు చేసుకుంటాయని ఇది వాస్తవమన్నారు. ఒక మహిళ అని చూడకుండా అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు. నేను కూడా రైతు బిడ్డనేనని , రైతుల కోసం పాటు పడ్డామన్నారు.