తెలంగాణ సీఎంకు కోర్టు నోటీసులు
25న హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది కోర్టు. ఈనెల 25న నాంపల్లి కోర్టులో హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పరువు నష్టం కేసుకు సంబంధించి ఈ నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీని డ్యామేజ్ చేసేలా కామెంట్స్ చేశాడంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు ఎక్కారు. ఈ మేరకు ఆయనపై పరువు నష్టం దాఖలు చేశారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా జరిగిన ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడాడని, నోరు పారేసుకున్నాడని, తన స్థాయికి తగ్గ రీతిలో కామెంట్స్ చేయ లేదంటూ పిటిషనర్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఎన్నికల క్యాంపెయిన్ లో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ రేవంత్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దావా దాఖలు చేసిన కాసం వెంకటేశ్వర్లు.
అయితే కాసం వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించడంతో..సదరు కోర్టు నాంపల్లి కోర్టుకు కేసు అప్పగించింది. దీనిపై త్వరితగతిన తేల్చాలంటూ ఆదేశించింది. దీంతో కోర్టు సీఎంకు నోటీసులు జారీ చేసింది.