కుప్పంలో నారా భువనేశ్వరి వెల్లడి
కుప్పం – ప్రజాసేవకే తమ కుటుంబం అంకితమైందని నారా భువనేశ్వరి అన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని , అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని అన్నారు. గత పాలకులు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం నక్కలపల్లి, రామకుప్పం మండలం కొంగనపల్లిలో నారా భువనేశ్వరి పర్యటించారు. నక్కలపల్లిలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మల్బరీ తోటలను నారా భువనేశ్వరి పరిశీలించారు. ఆ తర్వాత పట్టు పరిశ్రమలను సందర్శించారు. పట్టు పురుగుల నుంచి దారం తయారీ విధానంపై అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. నక్కలపల్లిలో పట్టు మహిళా రైతులతో సమావేశమైన నారా భువనేశ్వరి మహిళలు భయాన్ని వదిలి ధైర్యంగా ముందడుగు వేస్తే సాధించలేనిది ఏం లేదన్నారు. నిజం గెలవాలి యాత్ర చేయడానికి నేను భయపడ్డాను. నిత్యం ప్రజా సేవలో ఉండే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మేము చాలా బాధపడ్డాము. ఆ సమయంలో ప్రపంచంలోని తెలుగువారంతా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. టీడీపీ కుటుంబసభ్యులు ముఖ్యంగా మహిళలు అందించిన ప్రోత్సాహం, ధైర్యంతో నేను యాత్రను కొనసాగించాను. యాత్ర చేసేప్పుడు అన్ని వర్గాల ప్రజలను కలిసే అవకాశం , వారి కష్టసుఖాలను ప్రత్యక్షం చూసే అవకాశం నాకు కలిగిందన్నారు.