విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి
సీఎం సతీమణి నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా – చదువు ఒక్కటే మనల్ని కాపాడుతుందని, అదే గౌరవాన్ని తీసుకు వచ్చేలా చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. బాగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు తీసుకు రావాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముఖా ముఖిలో పాల్గొన్నారు. అనంతరం మహిళా సంఘాల మహిళలతో భేటీ అయ్యారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. శనివారం పర్యటనలో భాగంగా
రామకుప్పం మండలం విజలాపురంలోని కేజీబీవీ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు భువనేశ్వరి.
విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారికి స్వయంగా తానే వడ్డించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. కష్టపడి చదువుకుంటే పెద్ద కంపెనీలకు సీఈవోలుగా అవుతారని అన్నారు. ఆనాటి డొక్కా సీతమ్మ ఔన్నత్యం, ఆమె జీవితం గురించి పిల్లలకు వివరించారు.
ఇదిలా ఉండగా కూటమి సర్కార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారని తెలిపారు.