Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHఏపీలో ప్ర‌పంచ స్థాయి ఏఐ యూనివ‌ర్శిటీ

ఏపీలో ప్ర‌పంచ స్థాయి ఏఐ యూనివ‌ర్శిటీ

ఏర్పాటు చేస్తామ‌న్న మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త్వ‌ర‌లో ప్ర‌పంచ స్థాయి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ ) విశ్వ విద్యాల‌యాన్ని ఏర్పాటు కానుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి విధి విధానాల‌ను రూపొందించాల‌ని ఆదేశించారు.

రాష్ట్రంలో యూనివ‌ర్శిటీల ప‌నితీరుపై నారా లోకేష్ స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎకో సిస్ట‌మ్, యూనివ‌ర్శిటీ ర్యాంకింగ్స్ పై దృష్టి సారించాల‌ని అన్నారు. అకడమిక్ ఎక్సెలెన్స్, ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి.

ఏపీని ఏఐ హ‌బ్ గా తీర్చి దిద్దాల‌న్న‌దే త‌మ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, దీనిని ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేది త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించారు నారా లోకేష్.

ఎఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ తదితర 16 రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించే ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు. విద్యారంగానికి సంబంధించి అధునాతన ఎఐ టెక్నాలజీద్వారా కెజి నుంచి పిజి వరకు విద్యార్థులకు స్టూడెంట్ పాస్ పోర్టు ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని అన్నారు.

దీనిద్వారా విద్యార్థుల అటెండెన్స్ తోపాటు వారి తెలివితేటలను అంచనా వేసి, మెరుగు పర్చడానికి ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.

ర్యాంకింగ్స్ విషయంలో ఆంధ్రా యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, జెఎన్ టియు (కాకినాడ) మాత్రమే సంతృప్తికర పనితీరు కనబరుస్తున్నాయని అన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.

యూనివర్సిటీల్లో పరిశోధనలు పెరగాల్సి ఉందని, పరిశ్రమ అనుసంధానిత ఇంటర్న్ షిప్, అప్రెంటీస్ షిప్ లు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. విద్యార్థులు కుల ధృవీకరణ పత్రాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. యూనివర్సిటీల్లో విసీల నియామక ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments