నాడు నేడుపై విచారణ జరిపిస్తాం
ప్రకటించిన మంత్రి నారా లోకేష్
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఏపీ శాసన సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన స్పందించారు. విద్యా రంగాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన నాడు నేడు కార్యక్రమంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి విచారణ జరిపిస్తామని ప్రకటించారు నారా లోకేష్. విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
వచ్చే ఏడాది నుంచి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. కేవలం ప్రచార ఆర్భాటమే మిగిలిందని, దీని కోసం కూఢా భారీగా ఖర్చు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు విడతల్లో చేసిన నాడు-నేడు పనులు మొత్తం అవినీతి, నాసిరకంగా ఉన్నాయని అన్నారు నారా లోకేష్. రెండు విడతల్లో పనులు మొత్తం పెండింగ్ పెట్టారని, మూడో విడత అసలు మొదలే కాలేదన్నారు. రూ.900 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్లారని, ఖర్చు పెట్టిన దాంట్లో మొత్తం అవినీతి జరిగిందన్నారు.
గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో, 72 వేల మంది విద్యార్ధులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్ళిపోయారని చెప్పారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థని కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందన్నారు.