ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన పథకం
విశాఖపట్నం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదులు, లాయర్లకు తీపి కబురు చెప్పారు ఏపీ ఐటీ, విద్యా, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ఆయన ఓ కేసు విషయమై విశాఖ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
న్యాయవాదులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా మీకు పూర్తిగా సామాజిక భద్రత కల్పించేలా కృషి చేస్తానని ప్రకటించారు.
న్యాయవాదులకు ఆరోగ్యశ్రీయే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంతో అనుసంధానం చేసి మెరుగైన స్కీమ్ తీసుకు రావాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు నారా లోకేష్. పెండింగ్ లో ఉన్న కోర్టు భవనాల పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు.
న్యాయ వాదులు, లాయర్లకు ఇళ్ల నిర్మాణం, ఇంటి పట్టాలు అందిస్తామని తెలిపారు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నారా లోకేష్.