ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
అమరావతి – ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇక నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించామని ప్రకటించారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.
ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.
ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వచ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని స్పష్టం చేశారు.
మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల పాఠశాలల్లోనే సమావేశాలకు హాజరు కావాలని, ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్బాటాలకు తావీయ వద్దని అన్నారు నారా లోకేష్.