నోటిఫికేషన్ ఇస్తున్నామన్నా లోకేష్
అమరావతి – ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. నిరుద్యోగులకు శుభ వార్త చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16 వేల 347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం దశల వారీగా ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యా రంగం అభివృద్దిపై ఫోకస్ పెడుతుందన్నారు. ఇప్పటికే ఆయా విశ్వ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. నైపుణ్యాభివృద్దిపై ఎక్కువగా దృష్టి సారించామన్నారు.
విద్యార్థులు, నిరుద్యోగులు సైతం మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా తమ స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు నారా లోకేష్. ఆరు నూరైనా , ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ,అప్పులు చేసైనా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే విద్యా సంస్థల బలోపేతం కోసం కృషి చేస్తున్నామని, కాలేజీల్లో సైతం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామన్నారు.