యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి – అల్ప పీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల తాకిడికి ఏపీ తల్లడిల్లుతోంది. ఈ తరుణంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష చేపట్టారు. ఆయనతో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రితో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రివ్యూ చేశారు.
విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరు హెలికాప్టర్లు ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వివిధ శాఖల మధ్య సహాయక చర్యలకు సంబంధించి సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఏపీ మంత్రి.
బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార , నీటి ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు నారా లోకేష్. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్లో 2,500 ఆహార పొట్లాలు చేరవేశామన్నారు.
విజయవాడ పరిధిలో వరద ముంపునకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. తెలుగుదేశం శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వరద బాధితులకు సాయం చేస్తున్నట్లు చెప్పారు నారా లోకేష్.