దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నారా లోకేష్
అమరావతి – కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, డ్రైవర్ మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. కర్ణాటకలోని హంపి క్షేత్ర పర్యటనకు వెళ్లిన వారి వాహనం సింధనూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.
ఎవరూ కూడా ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వమే అన్నింటిని భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ దావోస్ పర్యటనలో తన తండ్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులతో కలిసి పర్యటిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రముఖులతో భేటీ అవుతున్నారు.
ఈ తరుణంలో ప్రమాద ఘటన తెలిసిన వెంటనే స్పందించారు. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ తో మాట్లాడారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో హుటా హుటిన సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు సీఎస్.