నారా లోకేష్ ప్రజా దర్బార్
ఛాంబర్ వద్దకు బాధితులు
అమరావతి – ఏపీ ఐటీ, విద్య, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి బాధితులు పోటెత్తారు. నిత్యం సమస్యలు, వినతులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు నారా లోకేష్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను గెలిచినా గెలవక పోయినా ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజలతో ముఖాముఖి చేపట్టారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడి అక్కడికక్కడే పూర్తయ్యేలా నారా లోకేష్ ఫోకస్ పెట్టారు.
ఇదిలా ఉండగా కేబినెట్ మీటింగ్ సందర్బంగా తన ఛాంబర్ కు వచ్చిన మంత్రిని కలిసేందుకు బాధితులు పోటెత్తారు. ప్రధానంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను విన్నవించారు.
ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు నారా లోకేష్. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.