నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ
విశాఖలో మంత్రి ప్రజా దర్బార్
విశాఖపట్నం – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం విశాఖపట్నంలో ప్రజా దర్బార్ చేపట్టారు. నగరంలోని నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అంగన్వాడీ బాలల గదిని సందర్శించిన మంత్రి కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు. ఎబిసిడి లు, రైమ్స్ వచ్చా అని అడగ్గా… వారు ఆడుతూ పాడుతూ సమాధానాలు ఇచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను ఆరాతీశారు నారా లోకేష్. విద్యార్థులకు చాక్లెట్లు పంచి, వారితో కలిసి ఫోటో దిగారు.
నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయాన్ని మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీ… 9.45 గంటలకు కూడా మూసివేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రంథాలయాల బలోపేతానికి మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని నిర్ణయించారు.
విద్యార్థులు, నిరుద్యోగులు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్ ను అధ్యయనం చేసి రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
అనంతరం విశాఖ జిల్లా టిడిపి కార్యాలయంలో 45వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.