నారా లోకేష్ ప్రజా దర్బార్
28వ రోజుకు చేరుకున్న కార్యక్రమం
అమరావతి – ఓ వైపు మంత్రిగా బిజీగా ఉంటూనే మరో వైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు ఏపీ విద్యా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్. ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇవాళ కూడా తన ఉండవల్లి లోని నివాసంలో ప్రజా దర్బార్ చేపట్టారు నారా లోకేష్ . మంగళవారం నాటికి ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం 28వ రోజుకు చేరుకుంది. ఇవాళ వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా వైసీపీ హయాంలో జరిగిన ఆక్రమణలు, కబ్జాలతో భూ వివాదాలకు సంబంధించినవి వచ్చాయి.
లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్భార్‌కి అతి ఎక్కువగా వినతులు భూ సమస్యలపై వస్తున్నాయని గుర్తించారు. భూ వివాదాల సమస్యలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు అప్పటికప్పుడు.
ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి వినతులు అందించారు. అందరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నారా లోకేష్. ఇదిలా ఉండగా అమరావతి పునర్ నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు రూ.28వేల విరాళాన్ని అందించారు, వారికి కృతజ్ఞతలు తెలిపారు నారా లోకేష్.