ఏపీ మోడల్ రూపకల్పనపై ఫోకస్
చర్యలు తీసుకోవాలన్న నారా లోకేష్
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా పరంగా సమూలమైన మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో దేశంలోనే ఏపీ ఆదర్శ ప్రాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యా పరంగా బడులు, కాలేజీలు, యూనివర్శిటీలు అన్నీ సరస్వతీ నిలయాలుగా తయారు కావాలని కోరారు. దీనికి కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తామని స్పష్టం చేశారు. విద్యంలో దేశంలోనే అత్యున్నతమైన విద్యా ప్రమాణాలను పాటించాలని కోరారు.
ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షించారు నారా లోకేష్. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. పాఠ్యాంశాల్లోనే కాకుండా స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించాలన్నారు.
కెజిబివి స్కూళ్లలో టీచింగ్ పోస్టులను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని, ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా టీచర్లను సర్దుబాటు చేయాలని ఆదేశించారు నారా లోకేష్. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా సత్కరించబోయే ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.